దసరా ఉత్సవాల్లో భాగంగా అమృత్‌సర్ నగర శివార్లలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘రావణాసురుడు దహనం’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వందలాది మంది ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని రావణాసురుడు దహనాన్ని వీక్షించే క్రమంలో రైలు వారిని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 61 మంది దుర్మరణం చెందగా మరో 57 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆ ప్రమాదానికి కారణమైన రైలును నడిపిన డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
ఓ వంతెన మీద వేలాడుతున్న మృతదేహానికి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ... ‘అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మీడియా అతడి వ్యక్తిత్వాన్ని పదేపదే కించపరచడమే దానికి కారణం. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలి’ అని పేర్కొంటూ వేలాదిమంది దాన్ని షేర్ చేస్తున్నారు.
ఆ ఫొటోతో పాటు ఆ డ్రైవర్ పేరును అరవింద్ కుమార్‌గా పేర్కొంటూ, అతడు రాసిన ఆత్మహత్య లేఖ అంటూ ఒక లేఖను కూడా చూపిస్తూ ఆ పోస్టును సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. #AmritsarTrainTragedy అనే హ్యాష్‌ట్యాగ్‌తో దాన్ని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో పంజాబ్ పోలీసు అధికారి కూడా ఒకరు ఉండటంతో ఆ పోస్టుకు మరింత బలం చేకూరింది.
ఫేక్ వైరల్ న్యూస్ వెనుకవున్న నిజాం :
అమృత్‌సర్ రైలు ప్రమాదానికి కారణమైన రైలు డ్రైవర్ ఆత్మహత్య చేసుకోలేదు. అతడు ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో పోలీసుల అదుపులో ఉన్నాడు. అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆ ఫొటోల్లో ఆత్మహత్య లేఖ అంటూ చూపుతున్న లేఖ అసలు ఆత్మహత్య లేఖే కాదని స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేసి విషయాన్ని సంచలనంగా మార్చే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు.అమృత్‌సర్ స్టేషన్ సుపరింటెండెంట్ కూడా ఈ ఫొటోలు, వీడియో నకిలీవని తేల్చారు. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న ఫొటో అక్టోబర్ 20 అమృత్‌సర్ గ్రామీణ ప్రాంతంలో ఉరి వేసుకుని చనిపోయిన ఓ వ్యక్తిదని పోలీసులు తెలిపారు.
రావణాసురుడు దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్ మాజీమంత్రి నవజోత్‌కౌర్ సిద్దూ హాజరయ్యారు. నవజోత్‌కౌర్ కళ్లెదుటే ఈ ఘోర ప్రమాదం జరగడం దురదృష్టకరమని పంజాబ్ మంత్రి, ఆమె భర్త నవజోత్‌సింగ్ సిద్దూ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తానని తెలిపారు. అలాగే, ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి